తాజా లోకల్ ఈవెంట్స్
Search

ఇదో ప్రేమ కథ

*** ఇదో ప్రేమ కథ ***


‘పందిట్లో పెళ్లవుతున్నాదీ కనువిందవుతున్నాదీ...’ పాత పాట శ్రావ్యంగా వినిపిస్తోంది కళ్యాణ మండపంలో. రంగురంగుల దీపాలు ధగధగాయమానంగా వెలిగిపోతున్నాయి. పట్టుచీరెల రెపరెపలు, అత్తరు పరిమళాలు, కిలకిల నవ్వులు గలగల కబుర్లతో అంతా సందడిగా ఉంది. లక్షాధికారి లక్ష్మీపతి గారమ్మాయి సంజన, పారిశ్రామికవేత్త భూషణంగారబ్బాయి సుజన్‌ల ప్రేమ వివాహం మరి!
కానీ-
హఠాత్తుగా నవ్వులు, కబుర్లు ఆగిపోయి గుసగుసలు ప్రారంభమయ్యాయి. అందుక్కారణం - కళ్యాణ వేదిక కుడివైపున్న మగ పెళ్లివారి విడిది గదిలో ఏదో జరుగుతున్నదని అశరీరవాణి వ్యాపించడమే. ఆ గది ముందు జనం గుమిగూడుతున్నా లోనికి వెళ్లి చూడటానికి ఎవరూ సాహసించడంలేదు.
సీతాకోకచిలుకల్లా రెపరెపలాడుతున్న అమ్మాయిల ఫొటోలు తీస్తున్న ప్రశాంత్‌కి అశరీరవాణి వినిపించి ఆ గది వద్దకెళ్లాడు. వరుడు సుజన్ అతని మిత్రుడే కనుక చొరవగా గదిలోకి వెళ్లాడు. సుజన్, అతని తల్లిదండ్రులు, మధ్యవర్తి తగ్గు స్వరంతో సీరియస్‌గా ఏదో చర్చించుకుంటున్నారు. ఆ చర్చ ఒక ఫొటో గురించి.
చొరవగా ఫొటో లాక్కుని చూశాడు ప్రశాంత్.
ఒక గంటలో పెళ్లిపీటల మీద కూచోవలసిన సంజన పరాయి మగాడి కౌగిలిలో!
ఓ క్షణం ప్రశాంత్ ముఖం రంగు మారినా తర్వాత గలగలా నవ్వేసి ‘ఇది మార్ఫింగ్ చేసిన ఫొటో! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌వి. ఇంత చిన్న విషయం నీకు తెలియలేదా?’ అని సుజన్‌ని అడిగాడు.
‘మార్ఫింగ్ చేసిన ఫొటో అంటే డాడీ నమ్మడం లేదురా’ నిస్సహాయంగా అన్నాడు సుజన్.
అంతలో ఆత్రంగా సంజన తల్లిదండ్రులు కూడా ప్రశాంత్‌ని బయటకు పంపేసి అందరూ చర్చల్లో మునిగిపోయారు.
కళ్యాణ వేదిక ఎడమపక్కనున్న ఆడపెళ్లి వారి విడిదిలో సంజనను అలంకరిస్తున్నారు ఫ్రెండ్స్. జోకులు నవ్వుల ఆహ్లాద వాతావరణంలోకి కంగారుగా వచ్చిన వందన వరుని గదిలో జరుగుతున్న ఫోటో రగడ గురించి చెప్పింది. సంజన ముఖంలో వెలుగు ఆరిపోయింది. అందరూ సైలెంట్ అయిపోయారు.
‘అక్కడ ప్రశాంత్ కూడా వున్నాడు’ నెమ్మదిగా అంది వందన.
ఒక్కసారిగా సంజన రెచ్చిపోయి అరిచేసింది. ‘వాడే! ఆ రాస్కెలే ఆ ఫొటో సృష్టించి ఉంటాడు. వాడిని ఈడ్చుకు రండి’
ఎవరూ ఈడ్చుకురాకుండానే స్వయంగా ప్రశాంత్ అక్కడికొచ్చాడు. అతనిని చూస్తూనే ‘ఒరేయ్! తిన్న చెప్పుదెబ్బలు సరిపోలేదా? ఇంకా కావాలా? నీచుడా! నికృష్టుడా!’ పూనకంలాగ అరవడం మొదలుపెట్టింది సంజన.
‘సంజూ! ప్లీజ్! నేను చెప్పేది విన్నాక కావాలంటే అప్పుడు చెప్పుతో కొట్టు. ముందు చెప్పేది విను. ఆ ఫొటోతో బ్లాక్‌మెయిల్ చేసి మరింత డబ్బు గుంజాలని వాళ్ల ప్లాన్. సుజనే ఆ ఫొటో సృష్టించి ఉంటాడు. నన్ను నమ్ము సంజూ! వాడు నీకు సరైనవాడు కాదు’
అతని మాట పూర్తి కాకుండానే ‘నోర్ముయ్! చెప్పాల్సింది చెప్పేశావుగా! ఇంక తగలబడు! ఫో! ఈ పెళ్లి చెడగొడితే గతిలేక నేను నిన్ను పెళ్లాడుతా ననుకుంటున్నావేమో! చావనైనా చేస్తాను గాని నిన్ను చేసుకోను. ఫో’ హిస్టిరికల్‌గా అరుస్తూ చెప్పు తీసింది.
జనం మూగుతారన్న భయంతో ప్రశాంత్‌ని వెళ్లమన్నట్టు దండం పెట్టి సంజన నోరు మూసేసి ఆమెను బాత్‌రూంలోకి లాక్కుపోయింది వందన.
తలవంచుకొని ప్రశాంత్ వెళ్లిపోయాడు.
సుజన్, సంజన, ప్రశాంత్‌ల లవ్‌ట్రయాంగిల్ గురించి వందనకు తెలుసు. సుజన్ అందం, ఆస్తి చూసి పడిపోకు. వాడు మంచోడు కాడని ఎన్నోసార్లు సంజనను హెచ్చరించింది వందన. ఇప్పుడు మళ్లీ హెచ్చరించాలనిపించినా తగిన సమయం కాదని ఊరుకుంది.
వందన, సంజన బాత్‌రూం నుంచి బయటకొచ్చేసరికి, సంజన తల్లిదండ్రులు వరుని విడిది నుంచి వచ్చి నిస్త్రాణగా కుర్చీలో కూలబడ్డారు.
ఫొటో చూపించి బెదిరిస్తూ కట్నం కోటి ఇస్తామంటూ సంబంధాలొస్తున్నాయి - అబ్బాయి ప్రేమించాడు కాబట్టి యాభై లక్షలిస్తే చెప్పుకోడానికి బాగుంటుందని మధ్యవర్తి చేత చెప్పించాడట నాగభూషణం. నిలుచున్న పాటున అంత సొమ్ము ఎలా సర్దుబాటు చేయగలం అని అడిగితే నగలు గాని, ఇల్లుగాని హామీగా ఉంచి వారంరోజుల్లో ఇమ్మన్నారట.
పీటల మీది పెళ్లి ఆగిపోతే అవమానం. ఫొటో వల్ల పరువు పోయి అమ్మాయికింక పెళ్లి కాదన్న భయంతో కట్నం ఇవ్వడానికి తండ్రి ఒప్పుకున్నట్టు తెలియగానే దిగ్భ్రాంతి చెందింది సంజన.
‘నేను చెప్పిందే మీ నాన్న చెప్తున్నారు. నన్ను చెప్పుతో కొడతానన్నావు. ఇప్పుడు మీ నాన్నని చెప్పుతో కొట్టు!’ అని ప్రశాంత్ హేళనగా నవ్వుతున్నట్టు అనిపించి ఆమె గుండెలు అవిసిపోయాయి.
‘ప్రేమించుకున్నారు కదా. నీ గురించి అతనికి బాగా తెలిసి ఉండాలి కదా. ఫొటో చూపించి అతని తండ్రి వీరంగం ఆడితే నీకు సపోర్ట్‌గా ఒక్కమాట చెప్పలేదు అతగాడు. ఏం ప్రేమలో! ఏమిటో!’ నిస్పృహగా అన్నాడు లక్ష్మీపతి.
తండ్రి వేదన చూసి ‘నేనీ పెళ్లి చేసుకోను’ అని అరవాలనుకుంది సంజన. కాని నోట మాట రాలేదు. కళ్లలోంచి కన్నీరుబికింది!
* * *
పెళ్లై అత్తారింట అడుగుపెట్టిన సంజన కొత్త ప్రపంచంలో దారి తప్పిన టూరిస్టు లాగ ఉక్కిరిబిక్కిరి అయింది.
కట్నం పెళ్లి ఆమె కిష్టంలేదు. ప్రేమించుకునే రోజుల్లో సుజన్ కూడా కట్నం తీసుకోనన్నాడు. కాని తండ్రి బ్లాక్‌మెయిల్ చేసి కట్నం అడిగితే వ్యతిరేకించలేదు. ఈ పెళ్లి వద్దనలేకపోయిన సంజన అసంతృప్తితోనే అత్తారింటికొచ్చింది. అక్కడి పరిస్థితులు ఆమెను మరింత కుంగదీశాయి.
అన్నీ ఆంక్షలే. ఉద్యోగం చేయకూడదు. ఒంటరిగా బయటకు వెళ్లరాదు. టాప్స్, జీన్స్ లాంటి వస్తధ్రారణ నిషిద్ధం. సెల్‌ఫోన్ ఎక్కువగా వాడకూడదు. ఫేస్‌బుక్, వాట్సప్ లాంటివి అసలే వద్దు. ఏ విషయంలోనూ భర్త అండ, సహకారం ఉండవు. తన అభిప్రాయం అడగరు. చెప్తే వినరు.
ధగధగ మెరిసే బంగారు పంజరంలో అందాల పంచవనె్నల చిలుక బతుకు అయింది తనది. చూసేవాళ్లంతా అబ్బో బంగారు పంజరం! ఆహా అందాల చిలుక! అని మెచ్చుకుంటారు. చిలుకకు ఎంత వైభోగం! అనుకుంటారు గాని దాని క్షోభను ఎవరూ పట్టించుకోరు.
అత్తగారు మహానటి! ఇంటికెవరు వచ్చినా అబ్బా! ఎంత మంచి అత్తగారు! కోడల్ని సొంత బిడ్డలా చూసుకుంటున్నది అన్న భ్రమ కలిగిస్తారు. అలా ఆరు నెలలు గడిచేసరికి జీవితం నిస్సారంగా, నిర్జీవంగా కనిపించ సాగిందామెకు. చూసిన వారెవరైనా తమది ప్రేమ వివాహం అనుకోగలరా అన్న సందేహం కలుగుతుందామెకు.
పెళ్లయ్యాక మొదటి పండుగ అంటూ సంక్రాంతికి ఇరవై లక్షల కారు, బర్త్‌డేకి లక్ష రూపాయల కెమెరా ఇలా చీటికి మాటికి కానుకలు గుంజుతూనే ఉన్నాడు సుజన్. కానుకలు స్టేటస్ సింబల్ అట!
ప్రేమ పొర కరిగిపోయి వాస్తవాల ముళ్లు గుచ్చుకుంటున్నాయి సంజనకు.
* * *
ఓ రోజు సుజన్ మిత్రుడు మోహన్ వచ్చాడు. టిఫిన్, టీ అయాక ఇద్దరూ కబుర్లలో పడ్డారు.
సుజన్ సంజనల పెళ్లి అయిన నెల రోజులకే తల్లిదండ్రులు చూపించిన బీద కుటుంబం పిల్ల మాధవిని కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడట ప్రశాంత్. వాళ్లింటికి వెళ్లినప్పటి సంగతులు మోహన్ చెప్తున్నాడు.
తలుపులు తెరిచి ఉండటంతో లోనికి వెళ్లి ప్రశాంత్‌ని వెదుకుతూ కిచెన్‌లోకి వెళ్లి స్తంభించిపోయాడట మోహన్. ఎందుకంటే ప్రశాంత్ వంట చేస్తున్నాడు! వంట!! కావలసిన దినుసులు, వస్తువులు అందిస్తున్నది మాధవి. మధ్యమధ్య సరసాలు, చతురోక్తులు, నవ్వులూ.
గుండెల్లోని ఆనందం కళ్లల్లో తొణికిసలాడుతోంది.
‘ఏరా! తలుపులు తెరిచే ఉన్నాయి. నేనొచ్చి ఐదు నిమిషాలైంది. మీరు గమనించనే లేదు. దొంగలు దూరి దోచుకుపోతేనో?!’ అన్నాడు మోహన్.
‘ఉదయం నించి కాకి అరిచి అరిచి చెప్పిందిరా నువ్వొస్తున్నావని! అందుకే తలుపులు తెరిచే ఉంచాం’ అని నవ్వేసి కిచెన్‌లోనే అతనికొక కుర్చీ వేసి కూర్చోబెట్టాడు ప్రశాంత్.
గుప్పెడు జీడిపప్పు వేపి చకచకా ఉప్పు, కారం చల్లి మోహన్‌కిచ్చింది మాధవి. తర్వాత కబుర్లే కబుర్లు.
‘వాళ్లది చూడచక్కని జంట. ముచ్చటైన సంసారం. వాళ్లది పెద్దలు కుదిర్చిన పెళ్లి. మరి మీది ప్రేమ వివాహం. మీ సంసారం ఎలా ఉందో చూద్దామని వచ్చాను. ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన వివాహమా? ఏది బెటర్?’ అడిగాడు మోహన్.
‘ఒక ప్రత్యేకత, ఒక గ్లామర్, ఒక గుర్తింపు ఉంటాయి కనుక ప్రేమ వివాహమే బెటర్’ ఠంగున చెప్పాడు సుజన్.
‘అది సరే. మీరు హాయిగా సంతోషంగా ఉన్నారా?’ సూటిగా అడిగాడు మోహన్.
ఈ ఆరాలన్నీ ఎందుకంటే మోహన్ కూడా ప్రేమలో పడ్డాడు. రెండు వైపులా పెద్దలు సరే అన్నారు. అయితే సమస్య ఎక్కడొచ్చిందంటే...
కట్నం అడిగేవాడిని పెళ్లి చేసుకోనంటుంది రూప. కట్నం ఇవ్వకపోతే పెళ్లి ప్రసక్తే లేదంటారు మోహన్ తల్లిదండ్రులు. ఏం చేయాలో తెలియక సుజన్ సలహా అడిగాడు మోహన్.
‘ఈ రోజుల్లో తల్లిదండ్రులు కూడా తెలివిమీరిపోయారురా! కాలేజీలో
ఎర్రగా బుర్రగా కరెన్సీతో కళకళలాడే కుర్రాడిని చూసి తగులుకొమ్మని తమ కూతుళ్లని ప్రోత్సహిస్తున్నారు. లవ్‌ట్రాప్‌లోకి లాగుతున్నారు. ప్రేమ పెళ్లి అయితే కట్నకానుక లివ్వనక్కర లేదన్న దురాశ! ప్రేమ, ప్రేమ అంటూ పెళ్లాం కొంగు పట్టుకు తిరిగే అల్లుడు కుక్కిన పేనులా పడి ఉంటాడన్న ముందుచూపు! వాడికి నాలుగు రకాల పిండివంటలతో ఘనంగా భోజనం పెట్టనక్కరలేదు. పచ్చడి మెతుకులు పడేస్తే చాలు అన్న పీనాసితనం! ప్రేమ పెళ్లిళ్లకు అమ్మాయిల్ని ఎగదోసే తల్లిదండ్రుల ఆలోచనలు అలా ఉంటాయి. అల్లుళ్లకూ కొన్ని హక్కులుంటాయని వాళ్లు మరిచిపోతారు. మనం మన హక్కులు కాపాడుకోలేకపోతే స్తంభానికి కట్టేసిన కుక్క బతుకు అయిపోతుంది మనది. స్తంభానికి కట్టేసిన కుక్క అరుస్తుంది గాని మీద పడి కరవలేదు. దానికి ఎవరూ భయపడరు’ అంటూ గలగలా నవ్వేశాడు సుజన్.
ఈ సుదీర్ఘ సుత్తికి తల తిరిగిన మోహన్ ‘ప్రేమా వద్దు, ప్రేమ పెళ్లీ వద్దు అంటావా?’ నిస్పృహగా అడిగాడు.
‘అది కాదు నా ఉద్దేశం. ప్రేమించు. పెళ్లి చేసుకో. కాని అత్తమామల్ని, ఆలిని గ్రిప్‌లో పెట్టుకో, నాలాగా’ ఈసారి సుదీర్ఘ నవ్వు!
అర్థం కానట్టు అయోమయంగా చూశాడు మోహన్.
ఉపదేశించే గురువులాగ పోజుపెట్టి చెప్పాడు సుజన్. ‘నువ్వెళ్లి కాబోయే మామగారితో చెప్పు కట్నం వద్దనీ, పెళ్లి ఏర్పాట్లు చేసుకోమనీ. పెళ్లిరోజు ఒక ఫొటో రిలీజ్ చెయ్యి’
‘్ఫటోనా? ఏ ఫొటో?’ అడిగాడు మోహన్ ఆశ్చర్యంగా.
‘నీ ప్రేయసి రూప నా కౌగిలిలో ఉన్న ఫొటో!’ ఠక్కున చెప్పాడు.
మోహన్‌కి కోపం వచ్చింది.
‘కూల్‌డౌన్ మిత్రమా! జోక్ చేశాను. కోపం వద్దు. మార్ఫింగ్ ద్వారా రూప పరాయి మగాడి కౌగిలిలో వున్నట్టు ఫొటో సృష్టించు. ఉపయోగించు. ఇట్స్ ఈజీ!’ తేలికగా చెప్పాడు సుజన్. తర్వాత వ్రత విధానం వివరించాడు.
మోహన్ అనుమానంగా చూశాడు. ఆలోచించాడు. చివరకు అన్నాడు. ‘రూప చాలా టఫ్ గురూ! సంజన లొంగిపోయింది గాని రూప లొంగదు’
‘అయినా ఫర్వాలేదు. పెళ్లి కాన్సిల్ అవుతుంది. తర్వాత అమ్మానాన్నా చూపించిన అమ్మాయిని చేసుకొని ప్రశాంత్‌లాగ హాయిగా జీవించు!’ అంటూ మోహన్‌ని పంపేసి పక్క గదిలోకి సుజన్ వెళ్లగానే - ‘అక్కడే ఉండి మిత్రుల సంభాషణంతా విన్న సంజన కోపంగా అంది ‘నా తల్లిదండ్రులు నీ మీదకు నన్ను ఎగదోయలేదు. లవ్‌ట్రాప్ లేదు’
‘ఏదో అనేశానులే. కాని నువ్వు బీదవాడైన ప్రశాంత్‌ని కాదని నన్ను లవ్ చేయడానికి కారణం డబ్బు, అందం, హోదా కాదా?’ సూటిగా అడిగాడు సుజన్.
కాదు, కాదు అని అరవాలనుకుంది సంజన. కాని ఆమె గొంతు పెగలలేదు.
‘నువ్వు కాదన్నా గుండెలోతుల్లో ప్రేమ అందం, అంతస్తుల్ని చూస్తుంది. ఇది నిజం. నేను కూడా నాకన్నా పై అంతస్తు మీదనే దృష్టి నిలిపాను. కాని అక్కడ అందమైన అమ్మాయిలు తగలలేదు. అందుకే రెండు మెట్లు కిందకు దిగి నిన్ను ప్రేమించాను. ప్రశాంత్ కూడా రెండు అంతస్తులు పైన ఉన్న నిన్ను ప్రేమించి కుక్కలా నీ వెంట తిరిగితే చెప్పుతో కొడతానన్నావ్. పొమ్మన్నావ్. నీరు పల్లమెరుగు అన్నట్లుగా ప్రేమ అందం, అంతస్తులు ఎరుగు!’ నవ్వుతూ తన రూంలోకి వెళ్లిపోయాడు సుజన్.
సంజన కూలబడి ‘ప్రశాంత్! నన్ను క్షమించు’ అంటూ రోదించింది.