తాజా లోకల్ ఈవెంట్స్
Search

Urgent & Useful Information


చేతిలోనే పేలుతుంది... చైనా టపాసు మరి...
నగరంలో చైనా టపాసులు హల్‌చల్‌ చేస్తున్నాయి. వీటితో ఇబ్బందులు తప్పవని అధికార వర్గాలు హెచ్చరిస్తున్నాయి. పరాయి దేశం నుంచి దిగుమతి అయిన టపాసులు కావడం వల్ల వాటిలో నాణ్యత ఎంత అన్నదీ ప్రశ్నార్థకంగా మారింది. టపాసుల తయారీకి వినియోగించే భిన్న రకాల పదార్థాలను సమపాళ్లలో కలపకుంటే ప్రమాదాలు వాటిల్లవచ్చు. నాసిరకం టపాసులు ఒక్కోసారి చేతిలోనే పేలిపోయే ప్రమాదం నెలకొంటుంది. నగర మార్కెట్‌కు తమిళనాడులో తయారయ్యే టపాసులు అధికంగా వస్తాయి. అక్కడ కొన్ని సంస్థలు ఉన్నత ప్రమాణాలతో టపాసులను తయారుచేస్తుంటాయి. అలాంటి టపాసులు వాడడం వల్ల ప్రమాదాలు తక్కువగానే ఉంటాయి. టపాసుల తయారీలో చైనా ఏమేరకు ప్రమాణాలు పాటిస్తోందో తెలియని పరిస్థితి. ఈ కారణంగానే చైనా టపాసులు వాడొద్దని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెపుతున్నారు. ఇప్పటికే విశాఖ నగరంలో చాలా ప్రాంతాలను కాలుష్య మేఘాలు కమ్మేశాయి. పరిమితికి మించి నమోదువుతున్న కాలుష్య ఉదర్గాల కారణంగా నగర ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా పాతనగరం ప్రజలు గత కొన్ని దశాబ్దాలుగా కాలుష్యాన్నే శ్వాసగా పీలుస్తున్నారు. ఈ ప్రాంతంలో 20 శాతం మంది బ్రాంకైటీస్‌, ఆస్థమా వంటి శ్వాసకోస వ్యాధులతో బాధపడుతున్నారు. సాధారణ రోజుల్లోని పరిస్థితి ఇది. ఏటా దీపావళి తర్వాత ఇక్కడ పరిస్థితి మరింత దిగజారుతుంటుంది. సాధారణ వాయుకాలుష్యంతో పాటు బాణసంచా కాల్చడం ద్వారా వెలువడే కాలుష్య తీవ్రత దాదాపు రెట్టింపు ఉంటుందని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులు చెబుతున్నారు.
విష మూలకం : యాంటిమొనీ సల్ఫైడ్‌
వినియోగం : టపాసుల్లో రంగులు, మెరుపులు రావడానికి వినియోగిస్తారు.
ప్రభావం : మానవ శరీరంలో వూపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది. శ్వాసకోస సంబంధ సమస్యలు వస్తాయి.
పరిమాణం: * భారతీయ టపాసుల్లో: 8 శాతం * చైనా టపాసుల్లో : 25 శాతం విష మూలకం : పెర్‌క్లోరేట్‌ (అమ్మోనియం, పొటాషియం)
వినియోగం : ఆక్సీకరణకు (మండటానికి) వినియోగిస్తారు.
ప్రభావం : ఇది విషపూరితం. భూగర్భజలాలు, నీటిని కలుషితం చేస్తుంది. వూపిరితిత్తుల క్యాన్సర్‌, థైరాయిడ్‌ సమస్యలకు కారణమవుతుంది.
పరిమాణం: * భారతీయ టపాసుల్లో: 6 శాతం * చైనా టపాసుల్లో : 30 శాతం
విష మూలకం : పొటాషియం నైట్రేట్‌
వినియోగం : టపాసులు మండేందుకు ఇంధనంగా ఉపయోగపడుతుంది.
ప్రభావం : ఇది విషపూరితమైనది, వూపిరితిత్తుల క్యాన్సర్‌కు దారితీస్తుంది.
పరిమాణం: * భారతీయ టపాసుల్లో: 7 శాతం * చైనా టపాసుల్లో : 22 శాతం
విష మూలకం : ఆర్సెనిక్‌ సమ్మేళనం
వినియోగం : టపాసుల్లో రంగులు వచ్చేందుకు ఉపయోగిస్తారు.
ప్రభావం : వూపిరితిత్తుల క్యాన్సర్‌, చర్మ సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది.
పరిమాణం: * భారతీయ టపాసుల్లో: 3 శాతం * చైనా టపాసుల్లో : 8 శాతం
విష మూలకం : పాదరసం (మెర్క్యురీ)
వినియోగం : రెడ్యూసింగ్‌ ఏజెంట్‌
ప్రభావం : విషపూరితం, విష పదార్థాలను శరీరంలో పేరుకుపోయేలా చేస్తుంది.
పరిమాణం: * భారతీయ టపాసుల్లో: 2 శాతం * చైనా టపాసుల్లో : 6 శాతం
విష మూలకం : బేరియం నైట్రేట్‌
వినియోగం : టపాసుల్లో ఆకుపచ్చ రంగు కోసం వినియోగిస్తారు.
ప్రభావం : విషపూరితం, శ్వాసకోస సమస్యలు, రేడియోధార్మిక ప్రభావం, జీర్ణాశయాంతర సమస్యలు, కండర సంబంధిత బలహీనతలకు దారితీస్తుంది.
పరిమాణం: * భారతీయ టపాసుల్లో: 11 శాతం * చైనా టపాసుల్లో : 31 శాతం
విష మూలకం : రాగి (కాపర్‌) సమ్మేళనాలు
వినియోగం : టపాసుల తయారీలో నీలి రంగు కోసం వినియోగిస్తారు.
ప్రభావం : శరీరంలో విష పదార్థాలు పేరుకుపోవడం, క్యాన్సర్‌, చర్మసంబంధ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.
పరిమాణం: * భారతీయ టపాసుల్లో: 9 శాతం * చైనా టపాసుల్లో : 23 శాతం
విష మూలకం : సల్ఫర్‌ డయాక్సైడ్‌
వినియోగం : టపాసుల వినియోగం వల్ల ఉత్పత్తి అవుతుంది.
ప్రభావం : విషపూరితమైనది, ఆమ్ల (యాసిడ్‌) వర్షాలకు కారణమవుతుంది.
పరిమాణం: * భారతీయ టపాసుల్లో: 7 శాతం * చైనా టపాసుల్లో : 20 శాతం
విష మూలకం : నైట్రోజన్‌ డయాక్సైడ్‌
వినియోగం : టపాసుల వినియోగం వల్ల ఉత్పన్నమవుతుంది.
ప్రభావం : అత్యంత విషపూరితం, చిన్నారులకు ప్రాణాంతకమైనది. ఆమ్ల (యాసిడ్‌) వర్షాలకు కారణమవుతుంది.
పరిమాణం: * భారతీయ టపాసుల్లో: 6 శాతం * చైనా టపాసుల్లో : 14 శాతం
విష మూలకం : స్ట్రాన్షియం సమ్మేళనాలు
వినియోగం : టపాసుల్లో ఎరుపు రంగు కోసం వాడుతారు.
ప్రభావం : విషపూరితం, చిన్నారుల్లో శారీరక ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది.
పరిమాణం: * భారతీయ టపాసుల్లో: 5 శాతం * చైనా టపాసుల్లో : 12 శాతం
విష మూలకం : లెడ్‌ డయాక్సైడ్‌ / నైట్రేట్‌ / క్లోరైడ్‌
వినియోగం : టపాసుల్లో ఆక్సీకరణకు ఉపయోగపడుతుంది.
ప్రభావం : మొక్కలు, జంతువులకు హానిచేసే విషపూరితమైనది. అలాగే గర్భస్థ శిశువులు, చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు హాని చేస్తుంది. శరీరంలో విషపదార్థాలు పోగుపడేలా చేస్తుంది.
పరిమాణం: * భారతీయ టపాసుల్లో: 6 శాతం * చైనా టపాసుల్లో : 15 శాతం
విష మూలకం : లిథియం సమ్మేళనాలు
వినియోగం : టపాసుల్లో ఎరుపు రంగు కోసం వినియోగిస్తారు.
ప్రభావం : విషపూరితం, శ్వాసకోశ రుగ్మతలకు కారణమవుతుంది.
పరిమాణం: * భారతీయ టపాసుల్లో: 7 శాతం * చైనా టపాసుల్లో : 16 శాతం
విష మూలకం : కాడ్మియం సమ్మేళనాలు
వినియోగం : టపాసుల్లో రంగులు వచ్చేందుకు వినియోగిస్తారు.
ప్రభావం : వూపిరితిత్తులకు నష్టం కలిగిస్తుంది. క్యాన్సర్‌, జీర్ణాశయాంతర సమస్యలకు కారణమవుతుంది.
పరిమాణం: * భారతీయ టపాసుల్లో: 8 శాతం * చైనా టపాసుల్లో : 23 శాతం
విష మూలకం : నైట్రిక్‌ ఆమ్లం
వినియోగం : టపాసుల వినియోగం వల్ల ఉత్పన్నమవుతుంది.
ప్రభావం : విషపూరితం, వూపిరితిత్తుల కణజాలంపై దుష్ప్రభావం చూపుతుంది.
పరిమాణం: * భారతీయ టపాసుల్లో: 3 శాతం * చైనా టపాసుల్లో : 8 శాతం
విష మూలకం : అల్యూమినియం
వినియోగం : టపాసుల తయారీలో తెలుపు రంగు కోసం వినియోగిస్తారు.
ప్రభావం : చర్మసంబంధ వ్యాధులు, అల్జీమర్స్‌ వ్యాధికి దారితీస్తుంది. శరీరంలో విషపదార్థాలను పోగు చేస్తుంది.
పరిమాణం: * భారతీయ టపాసుల్లో: 6 శాతం * చైనా టపాసుల్లో : 14 శాతం
టపాసులు మండించడం ద్వారా గాయపడుతున్న శరీర భాగాలు
* కళ్లు: 16 శాతం
* తల, ముఖం, చెవులు: 22%
* చేతులు: 5%
* అరచేతులు, వేళ్లు: 36%
* కాళ్లు: 14%
* ఇతర భాగాలు 7%
శబ్ధకాలుష్యమూ ఎక్కువే...
మనిషి సాధారణంగా 70 నుంచి 80 డెసిబుల్‌ శబ్ధం వినగలడు. ఇంతకన్నా అధిక శబ్ధాలు (బాణసంచా పేలుళ్లు) వింటే కర్ణభేరిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
* శబ్ధ కాలుష్యం వల్ల శాశ్వత వినికిడిలోపం, రక్తపోటు, గుండెజబ్బులు, నిద్రలేమి, రోగ నిరోధశక్తి తగ్గడం, పుట్టక లోపాలు వంటివి వచ్చే ప్రమాదం ఉంది.
* టపాసుల శబ్ధం ఒత్తిడికి దారితీస్తుంది. మతిస్థిమితం కోల్పోయే ప్రమాదం ఉంది. రోడ్డు ప్రమాదాలకు దారితీయొచ్చు.
* బాణసంచా పేలుళ్ల శబ్ధాలకు పెంపుడు జంతువులు విచిత్రంగా ప్రవర్తించవచ్చు.
వీరిని దూరంగా ఉంచాలి
* పసిపిల్లలు, వృద్ధులు, గుండె జబ్బులు వంటి వ్యాధులతో బాధపడే వారు దీపావళి బాణసంచా పేలుళ్లకు దూరంగా ఉండాలి. అధిక శబ్ధాలు గర్భిణులు, గర్భస్థ శిశువులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.
ప్రమిదలే ముద్దు..
వివిధ ఆకృత్తుల్లో ఉండే ప్రమిదలను వెలిగించాలి. ఇంటికి కాంతులు వెదజల్లేవిధంగా విద్యుత్తు అలంకరణలు చేసుకోవచ్చు. మట్టితో తయారుచేసిన ప్రమిదలను వాడితే పర్యావరణహితంగా ఉంటుంది. ఒక వేళ పిల్లలు మారాం చేస్తే టపాసులు పేల్చడం వల్ల కలిగే అనర్థాలను తల్లిదండ్రులు తెలియచేయాలి.
నిబంధనలు ఇలా..
* తక్కువగా కాలుష్యం శబ్ధం వచ్చే టపాసులను మాత్రమే కాల్చాలి.
* రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకూ టపాసులు కాల్చరాదు.
* కాలుష్య నియంత్రణమండలి విధించే నిబంధలను కచ్ఛితంగా పాటించాలి.
* బాణసంచా వల్ల కలిగే నష్టాలపై చైతన్యం కలిగించాలి.
గాయాలపై పసుపు, టూత్‌పేస్టులు రాయొద్దు...
-డాక్టర్‌ పి.వి.సుధాకర్‌, ప్లాస్టిక్‌ సర్జన్‌ కేజీహెచ్‌
బాణసంచా కాల్చే సమయంలో నీటిని దగ్గర పెట్టుకోవాలి. వదులుగా ఉండే నూలు దుస్తులను ధరించాలి. ఒకవేళ పేలుడు కారణంగా గాయమైతే వెంటనే నీరు పోసి కడగాలి. పసుపు, టూట్‌పేస్టులు వంటివి గాయాలపై రాయొద్దు. చిచ్చుబుడ్డి, టపాసులు వంటివాటిని దూరంగా ఉండి కాల్చాలి. దీపావళి రోజున ప్రతీ ఏడాది కాలిన గాయాలతో 20 నుంచి 25మంది వరకూ కేజీహెచ్‌కు వస్తారు. వివిధ రకాల రసాయనాలతో తయారు చేసే బాణసంచా కారణంగా గాయపడితే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గాయపడినవెంటనే ఆసుపత్రికి తరలించాలి.
అధిక శబ్దంతో కూడిన బాణసంచా పేల్చొద్దు
-ఆర్‌.లక్ష్మీనారాయణ, ఈఈ, పీసీబీ
అధిక శబ్ధంతో కూడిన బాణసంచా పేల్చరాదని సుప్రీంకోర్టు గతంలో స్పష్టంచేసింది. 1000, 2000 వాలా టపాసులు కాలిస్తే అధిక శబ్ధాలు వస్తాయి. ఇలాంటి వాటి వల్ల కాలుష్య తీవ్రత రెట్టింపు అవుతుంది. సాధారణ రోజుల్లో 60 నుంచి 70 డెసిబుల్‌ ఉంటే దీపావళి రోజున 600 వరకు శబ్ధతీవ్రత ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ మాత్రమే పేల్చాలి. ఎవరికి వారు వ్యక్తిగత శ్రద్ధతీసుకొని తగు జాగ్రత్తలు పాటించాలి. తమ శాఖ పరంగా పర్యవేక్షణ ఉంటుంది.
చైనా బాణసంచాకు అనుమతి లేదు...
మనదేశంలో బాణసంచా అమ్మకానికి కానీ, తయారీకి కానీ చైనాకు చెందిన ఏ సంస్థకూ అనుమతి లేదు. కానీ చైనా ముడిసరకు, తయారైన బాణసంచా చాలా తక్కువ ధర ఉండటంతో కొంతమంది వ్యాపారులు అక్రమ మార్గంలో సరకును నగరానికి తెస్తున్నారని తెలుస్తోంది. చైనా నుంచి బంగ్లాదేశ్‌, నేపాల్‌లకు తొలుత ఈ సరకు చేరుతోంది. అక్కడి నుంచి సరిహద్దు రాష్ట్రాల ద్వారా రోడ్డు మార్గంద్వారాను, సముద్రమార్గం ద్వారా కాండ్లా, ముంబయి, కోల్‌కతా, ట్యూటికోరిన్‌ రేవులకు చేరుతోంది. అక్కడి నుంచి దేశవ్యాప్తంగా కంటెయినర్ల ద్వారా బాణసంచా ప్రతీ పట్టణానికీ చేరుతోందని అధికారులు చెబుతున్నారు. పిల్లలు ఆడుకునే బొమ్మలు, సైకిళ్లు, ఇస్త్రీపెట్టెలు, వీల్‌ఛైర్లు, బ్యాడ్మింటన్‌, టెన్నిస్‌ రాకెట్ల ద్వారా చైనా మందుగుండు దేశంలోకి చొరబడుతోంది.
* చైనా బాణసంచా దిగుమతి, స్థానికంగా తయారీ, విక్రయం వంటివి చేస్తున్నట్లు తెలిస్తే ఈ కింది నెంబర్లకు సమాచారమివ్వాలని రాష్ట్ర కస్టమ్స్‌ కమిషనర్‌ కోరుతున్నారు.
ఫోన్‌నెంబర్లు: 94910 64588 81060 88444 98854 44433Urgent



nanomag

Complete information about Local Events in Vijayawada


0 thoughts on “Urgent & Useful Information