తాజా లోకల్ ఈవెంట్స్
Search

నటరాజు తాండవమాడె..
నటరాజు పరవశించేనా.. మయూరాలు ముచ్చటపడి నర్తించేనా.. అన్నట్టుగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం ఘల్లుమనె గజ్జెల సవ్వళ్లతో మార్మోగిపోయింది. ఐదో అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభం కాగా, ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన నృత్య ప్రదర్శనలు రసజ్ఞులను ఆనందడోలికల్లో ముంచెత్తాయి.
ఆంధ్రప్రదేశ్‌ భాషా, సాంస్కృతిక శాఖ, సిలికానాంధ్ర ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో జరుగుతున్న ఐదో అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం అంబరాన్నంటింది. ప్రారంభోత్సవం అనంతరం లబ్ధప్రతిష్టులైన కళాకారుల ప్రదర్శనలు ఆద్యంతం ప్రేక్షకులను పులకింపజేశాయి. 108 అడుగుల విశాలమైన వేదికపై కళాకారుల నాట్య విన్యాసాలు ఆధ్యాత్మికానందాన్ని కలిగించాయి.
రాధేశ్యామ్‌.. మైమరపించెన్‌
కూచిపూడి నాట్యానికి సిద్ధేంద్రయోగి సూచించిన సంప్రదాయశైలిలో కూచిపూడి నాట్య గురువు వేదాంతం రాధేశ్యామ్‌ నాట్యపూర్వరంగం కార్యక్రమాన్ని నిర్వహించారు. 'అంబా పరాక్‌.. శారదాంబ పరాక్‌..' అంటూ సామూహిక గురు ప్రార్థన నిర్వహించారు.
స్వప్న‘సుందరం’
'భామా కలాపం' అంశాన్ని పద్మభూషణ్‌ స్వప్నసుందరి అత్యంత రమణీయంగా ప్రదర్శించారు. ప్రవేశ దరువుతో పాటు పంచ చామరాలు, మన్మద విరహ సన్నివేశాలను అద్భుతంగా ప్రదర్శించారు. ఆరు పదులు దాటినా అలుపెరగక ఆమె ప్రదర్శించిన తీరు అద్భుతంగా సాగింది. ప్రదర్శనను తిలకించిన సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ రామ సుబ్రహ్మణ్యం ఆమెను సన్మానించారు.
‘శోభా’యమానం
పద్మశ్రీ శోభానాయుడు అమాయకపు యువతి పాత్రలో చూపించిన నాట్య విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సిగ్గులొలికే సన్నివేశాలకు ఆమె నాట్యం రక్తికట్టించింది.
ఇంకా.. సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీతలు పద్మశ్రీ జయరామారావు, వనశ్రీరావు ‘థిల్లానా’ తదితర అంశాలను అద్భుతంగా ప్రదర్శించారు. నాట్యగురువు ఏబీ బాలకొండలరావు 'కూచిపూడి పద్య నాట్యం' అంశాన్ని ప్రదర్శించారు. డాక్టర్‌ పద్మజారెడ్డి వివిధ అమ్మవారి శక్తి రూపాలను వివరిస్తూ 'శక్తి' అంశానికి నర్తించారు. అలాగే, నాట్య గురువులు భాగవతుల సేతురామ్, డాక్టర్‌ జ్వలాశ్రీకళ బృందం, డాక్టర్‌ వేదాంతం రామలింగశాస్త్రి, డాక్టర్‌ జయంతి రమేష్‌ బృందం, డాక్టర్‌ పప్పు వేణుగోపాల్, భాగవతుల వెంకటరామశర్మ, అజయ్‌ బృందం, పసుమర్తి రామలింగశాస్త్రి తదితరుల నృత్యాలు అద్భుతంగా సాగాయి.
'సుజనరంజని–నాట్యమంజరి' సావనీర్‌ ఆవిష్కరణ
ఐదో అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనంలో భాగంగా డాక్టర్‌ జుర్రు చెన్నయ్య, డాక్టర్‌ వాసుదేవసింగ్‌ ఆధ్వర్యంలో ప్రచురించిన 'సుజనరంజని–నాట్యమంజరి' సావనీర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు, న్యాయమూర్తులు జస్టిస్‌ ఎన్వీ రమణ, రామసుబ్రహ్మణ్యం ఆవిష్కరించారు.


For more information latest events / updates  and lot more... Download Vijayawada TownHub Free Mobile Service App & experience new ways to stay connect with latest happenings in our city.
To Download https://goo.gl/Nd3HWS


TAG

nanomag

Complete information about Local Events in Vijayawada


0 thoughts on “నటరాజు తాండవమాడె..