తాజా లోకల్ ఈవెంట్స్
Search

ఈ రోజు అట్లతద్ది నోము విశేషాలు

**** అట్లతద్ది నోము ****


కథ
పూర్వం ఒకప్పుడు ఒక రాజు కూతురు, మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా కలిసి మెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు. ఆరోజు అట్లతద్ది. రాత్రి చంద్రుడు ఉదయించాక చేసే పూజ కోసం వారు సన్నాహాలు చేసుకుంటున్నారు. పెద్దలంతా రాత్రికి దేవీ పూజ నైవేద్యం కోసం అట్లు వేయడంలో నిమగ్నులయ్యారు. ఇంతలో రాజుగారి కూతురు ఆకలితో సొమ్మసిల్లి పడింది. రాజకుమారుడు తన చెల్లి అవస్థ చూసి ఇంద్రజాలం చేశాడు.
ఒక అద్దంలో తెల్లని వస్తువు చూపించి 'అదిగో చంద్రోదయమైంది. అమ్మా!కొంచెం పండ్లు తిని సేదతీరి పూజ చేసుకో' అన్నాడు.
రాజకుమార్తె అన్నగారి మాట విశ్వసించి ఆహారం సేవించి పూజ చేసుకుంది. అయితే ఈ పూజ నియమం ఏమిటంటే చంద్రోదయం చూసి అప్పుడు షోడశోపచారాలతో ఉమాదేవిని పూజించాలి. అందుకే ఈ వ్రతానికి 'చంద్రోదయ ఉమావ్రతం' అని పేరు వచ్చింది. ఆరోజు స్త్రీలు, దేవిని ఆరాధించి తొమ్మిది అట్లు నైవేద్యంగా పెట్టి, తొమ్మిది అట్లు వాయనం ఇచ్చి, తొమ్మిది పువ్వుల ముడితో తోరం కట్టుకుంటారు. ఇలా చేస్తే మంచి భర్త లభిస్తాడని నమ్మకం. రాజకుమార్తె తన స్నేహితురాళ్ళతో అన్నీ యథావిథిగానే చేసింది. కానీ అన్న చెప్పిన మాట నమ్మి చంద్రోదయానికి ముందే భోజనం చేసింది.
ఆ రోజుల్లో ఆడపిల్లలకి బాల్యదశలోనే పెళ్లి చేసేవారు. ఆమెకు ముసలివాడు భర్తగా లభించాడు. “అయ్యో అట్లతద్ది నోము చేస్తే అందమైన భర్త లభిస్తాడన్నారు కదా! నా స్నేహితురాళ్ళకందరికీ మంచి యౌవనవంతులైన భర్తలు లభించారు. నేనేమి అపచారం చేశాను?” అంటూ దుఃఖించి పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించగా వారు ప్రత్యక్షమై" నీ అన్న అజ్ఞానం, నీ పై అతనికుండే ప్రేమవల్లనే వ్రతభంగం జరిగింది. రేపు ఆశ్వయుజ బహుళ తదియ, నీవు నియమనిష్టలతో చంద్రోదయ ఉమావ్రతం చేస్తే నీ భర్త యౌవనవంతుడవుతాడు" అన్నారు. ఆమె ఆ నోము చేసి కథ చెప్పి అక్షింతలు తీసుకుని భర్తమీద వేసేసరికి అతడు యౌవనవంతుడయ్యాడు . కన్నెపిల్లలు ఈ వ్రతం చేస్తే కోరిన వరుడు లభిస్తాడు. వివాహిత స్త్రీలు ఈ వ్రతం చేస్తే ఉమాదేవి అనుగ్రహానికి పాత్రులై సకల సౌభాగ్యాలను పొందుతారు.
ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ తదియనాడు స్త్రీలంతా ఆనందోత్సాహాల్తో అట్లతద్ది జరుపుకుంటారు. అట్లతద్దికి ముందురోజును భోగి అంటారు. భోగినాడు స్త్రీలంతా చేతులకు, పాదాలకు, గోరింటాకు పెట్టుకుని ఎవరి చేయి బాగా పండిందని ఉత్సాహంగా చూసుకుంటారు. ఎవరి చేయి ఎర్రగా పండితే వారికి అదృష్టం బాగుంటుందని వారి విశ్వాసం.
ఒక పండుగ వస్తే, అట్లు వండి అమ్మవారికి నివేదన చేస్తారు.దాని కోసం ముందు రోజే పిండి కొట్టుకోవడం, మినప్పప్పు రుబ్బి అట్లు తయారుచేయటం ఒక పెద్ద కార్యక్రమం. అట్లతద్దినాటి అట్లు తినడానికి ఉవ్విళ్ళూరుతారు. మగవాళ్ళు ఈ పండుగ కోసం ఎదురుచూస్తూ ఇంట్లో ఊయల కడతారు. పెరట్లో చెట్లకి కూడా ఉయ్యాల వేస్తారు. ఈ ఉత్సవంలో పిల్లలంతా ఆసక్తిగా పాల్గొంటారు.
అట్లతద్దినాడు తెల్లవారుఝామున లేస్తారు.అన్నం, గోంగూర పచ్చడి, పెరుగుతో కడుపునిండా తింటారు. 'అట్లతద్దోయ్, ఆరట్లోయ్ ముద్దపప్పు మూడట్లోయ్' అంటూ అరుస్తూ ఇరుగు పొగురు స్నేహితులందరితో కలిసి ఆటలు ఆడతారు. ఇందులో పెద్దలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. ధైర్యంగా వీధుల్లోకి వచ్చి ఆడుకోవడానికి ఇదే అదును కాబట్టి పిల్లలతో బాటు తల్లులు కూడా బాల్య జీవితాల్లోకి వెళ్లి ఆనందం పొందుతారు.
అట్లతద్ది అంతరార్ధం
త్రిలోక సంచారి అయిన నారదముని ప్రోద్బలంతో గౌరీదేవి శివుని పతిగా పొందగోరీ మొదటిసారిగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్త్రీలు సౌభాగ్యం కోసమై చేసుకునే వ్రతం ఇది. చంద్రారాధన ప్రధానమైన చంద్రకళల్లో కొలువై వున్న శక్తి అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని, కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని శాస్త్ర వచనం.
ఈ పండుగలో అమ్మవారికి అట్లని నైవేద్యంగా పెట్టడంలో ఓ అంతరార్థం వుంది. నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహాప్రియం. అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోష పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులూ రావని నమ్మకం. ఋతుచక్రం సరిగా వుండేలా చేసి కాపాడతాడు. అందువల్ల గర్భధారణలో ఎటువంటి సమస్యలూ వుండవు. మినప పిండి, బియ్యపు పిండిని కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువుకు, బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు. గర్భదోషాలు తొలిగిపోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి.
ఆశ్వయుజ బహుళ తదియనాడు వచ్చే అట్లతద్ది స్త్రీలకూ ఎంతో శుభప్రదమైనది. పిల్లలు, పెద్దలు, అందరికీ ప్రమోదాన్ని కలిగించే పర్వదినం. ఈరోజున తెల్లవారు ఝామున మేల్కొని గౌరీదేవి పూజ చేయాలి.చంద్రదర్శనం అనంతరం శుచియై తిరిగి గౌరీపూజ చేసి, ఆమెకు పది అట్లు నైవేద్యంగా పెట్టాలి. తర్వాత ముత్తయిదువులకు అలంకారం చేసి, పది అట్లు, పది ఫలాలు వాయనంగా సమర్పించాలి.
అట్లతద్ది నోము కథ చెప్పుకొని, అక్షింతలు వేసుకోవాలి. అనంతరం భోజనం చేయాలి. పదిరకాల ఫలాలను తినడం, పదిమార్లు తాంబూలం వేసుకోవడం, పదిమార్లు ఊయల ఊగడం, ఈ పండుగలో విశేషం.గౌరీదేవికి నైవేద్యంగా అట్లు పెడతారు గనుకే ఈ పండుగకు అట్లతద్ది అనే పేరు వచ్చింది.
దీనినే ఉయ్యాల పండుగనీ, గోరింటాకు పండుగ అనీ అంటారు.ఈవిధంగా వాయనం ఇచ్చుకుంటే గౌరీదేవి అనుగ్రహంతో పెళ్ళికాని అమ్మాయిలకు గుణవంతుడైన రూపసి భర్త లభిస్తాడని, పిల్లలు కలుగుతారని, ఐదవతనంతో పాటు పుణ్యం లభిస్తుందని తర తరాల నుంచి వస్తున్న నమ్మకం.పది మంది ముత్తైదువులకు నల్లపూసలు, లక్కకోళ్ళు, రవికెలగుడ్డ, దక్షిణ తాంబూలాలు మరియు పది అట్లు వాయనమిచ్చి, భోజనాలు పెట్టి ఆశీస్సులు తీసుకోవాలి.
పదేళ్లు ఈ వ్రతాన్ని నిర్వహించి, ఉద్యాపనం చెప్పుకున్న స్త్రీలకు సంసారంలోని సర్వసుఖాలు లభిస్తాయి. సృష్టి స్థితి లయలకు కారకులయిన బ్రహ్మ,విష్ణు, పరమేశ్వరుల భార్యలు సరస్వతి, లక్ష్మి, పార్వతులకు నేల పొడవునా ఉత్సాహం సాగే మాసం ఈ ఆశ్వీయుజం. అమ్మవారికి ఆటపాటలంటే ఇష్టం.
కాబట్టి ఇంకా రజస్వలలు కాని ఆడపిల్లలు ఆడినా పాడినా వాళ్ళంతా అమ్మవారి సేవ చేస్తున్నట్టే అని చెప్తున్నాయి పురాణాలు.

Vijayawada TownHub ·

For more info about Vijayawada, Please Download "Vijayawada TownHub" free mobile app from google play store / apple store.



nanomag

Complete information about Local Events in Vijayawada


0 thoughts on “ఈ రోజు అట్లతద్ది నోము విశేషాలు