తాజా లోకల్ ఈవెంట్స్
Search

ఉద్యోగ నియామకాల్లో నయా పోకడ



ఉద్యోగాల కోసం ఉద్యోగార్థులు పరిశ్రమలు, ఇతర కంపెనీల చుట్టూ తిరిగే రోజులు క్రమేణ తగ్గిపోతున్నాయి. పరిశ్రమల వర్గాలే ఉద్యోగార్థుల ముంగిటికి వస్తున్నారు. ప్రాంగణ నియామకాలనగానే ఇంజినీరింగ్‌ కళాశాలలే అందరికీ గుర్తుకొస్తాయి. వీటితోపాటు ఆఫ్‌క్యాంపస్‌ ద్వారా జరిగే నియామకాలతో పరిమితంగా విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారు. మరోపక్క ఎనిమిది, పదో తరగతి, ఐటీఐ పూర్తిచేసిన వారి దగ్గర నుంచి డిగ్రీ, బీటెక్‌ పూర్తిచేసిన వారికీ ఉద్యోగాల్ని ఇస్తామని ఐటీ, సాఫ్ట్‌వేర్‌, ఫైనాన్స్‌, బ్యాంకింగ్‌, కస్టమర్‌ కేర్‌, ఎలక్ట్రికల్‌, ఇతర రంగాలకు చెందిన సంస్థలు ఉద్యోగ నియామక మేళాలకు తరలివచ్చేస్తున్నాయి. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఈ మేళాలు తరచూ జరుగుతున్నాయి. ప్రస్తుతం సంక్షేమ శాఖలు, జవహర్‌నాలెడ్జి కేంద్రాలు, ఇతర శాఖలు కూడా ఈ బాటలోనే నడుస్తున్నాయి. సాంఘిక, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, కాపు కార్పొరేషన్‌, ఇతర శాఖల ద్వారా ఇటీవల ఉద్యోగ మేళాలు జరిగాయి. నియామకాలు కొంతవరకు జరుగుతున్నాయి. రకరకాల కంపెనీలు పాల్గొంటున్న ఈ ఉద్యోగ మేళాలకు తరలివచ్చిన ఉద్యోగ్యార్థుల్లో అత్యధికులు తాజాగా డిగ్రీ, బీటెక్‌ పూర్తిచేసిన వారు ఉన్నారు. ఇన్ని కంపెనీలకు ఉద్యోగార్థులకు నేరుగా వెళ్లడమన్నది జరిగేది కాదు. ఆయా సంస్థల అవసరాలకు అనుగుణంగా ఉద్యోగస్తుల్ని సమకూర్చే ఓ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ ‘‘మా క్లెయింట్స్‌ అవసరాలకు అనుగుణంగా నియామకాలను చేపట్టేందుకు ఇక్కడికి వస్తున్నాం. ఒకే ప్రాంగణంలో స్వల్ప వ్యవధిలో అవసరాలకు తగినట్లు నియామకాలు జరుపుకునేందుకు వీలవుతుంది. ప్రత్యేకంగా నియామకాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేయాలంటే డబ్బుతోపాటు సమయాన్ని కేటాయించాల్సి వస్తోంది. ఉద్యోగ మేళాలో పాల్గొంటే ఇవన్నీ ఆదా అవుతున్నాయి’’అని వివరించారు. మరోక సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ ‘‘ఉద్యోగ మేళా ద్వారా తమ వద్ద విద్యార్థుల వివరాలన్నింటినీ నమోదుచేసుకుంటున్నాం. వారికి ఏ రంగంలో ఉద్యోగం చేయాలని ఉందో తెలుసుకుంటున్నాం. వారి ప్రత్యేక అర్హతలను గుర్తిస్తున్నాం. ఒకవేళ అప్పటికప్పుడు ఉద్యోగాల్ని ఇవ్వలేకపోయినా భవిష్యత్తు అవసరాలకు ఉపయోగించుకునేలా జాగ్రత్తపడుతున్నాం’’అని వివరించారు.
కంపెనీల అవసరాలు గమనించా
* ఓ ఉద్యోగ మేళాకు హాజరైన గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘‘ఈ ఉద్యోగ మేళాలో నేను అనుకున్న ఉద్యోగం రాలేదు. కానీ కంపెనీల అవసరాలెంటో ప్రత్యక్షంగా గమనించా. విషయ పరిజ్ఞానం పెరిగింది’’అని వివరించారు.
* రెండేళ్ల కిందట బీటెక్‌ పూర్తిచేసిన కృష్ణా జిల్లాకు చెందిన ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘నేను ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నా. అక్కడ ఇచ్చే వేతనం కంటే ఎక్కువగా వేతనం ఇచ్చే కంపెనీలో ఉద్యోగం లభించే అవకాశం ఉందోమోనని వచ్చాను’’అని పేర్కొన్నారు.
* 2016-17లో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా 33 ఉద్యోగ మేళాలు జరగ్గా...9,270 మంది ఉద్యోగాలు పొందారని ఆ సంస్థ సీనియర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ శైలజ తెలిపారు.
* వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ద్వారా ఇటీవల నిర్వహించిన ఉద్యోగ మేళాలో 300 మంది ఉద్యోగాలు పొందినట్లు ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ తనూజ చెప్పారు.
* కాపు కార్పొరేషన్‌ అభివృద్ధి సంస్థ ద్వారా జరిపిన ఉద్యోగ మేళా రోజున 1620 మందికి ఉద్యోగాలు వచ్చాయని ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అమరేంద్ర తెలిపారు.
* గుంటూరు జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయ ఉపాధి అధికారి డాక్టర్‌ రజనీప్రియా మాట్లాడుతూ ‘‘నెలకు రెండు, మూడు ఉద్యోగ నియామకాల్ని చేపడుతున్నాం. కంపెనీ అవసరాల్ని అనుసరించి పరిమితంగా కూడా నియామకాల్ని చేబడుతున్నాం. ఒక్కోసారి పెద్దస్థాయిలోనూ ఉద్యోగ మేళాల్ని చేపడుతున్నాం. అభ్యర్థులు..పరిశ్రమల వారికి మేము ఓ వేదికను కల్పిస్తున్నాం’’అని పేర్కొన్నారు.

 Vijayawada TownHub · 


TAG

nanomag

Complete information about Local Events in Vijayawada


0 thoughts on “ఉద్యోగ నియామకాల్లో నయా పోకడ