తాజా లోకల్ ఈవెంట్స్
Search

నవ దృష్టి.. యువ సృష్టి


*** నిట్‌లో సాంకేతిక వేడుక.. అదరహో ***

ఎగిరే డ్రోన్లు.. పరుగెత్తే రోబోలు.. బుల్లి విమానాలు.. భవిష్యత్తు అవసరాలు.. మేధకు పదును పెట్టే ఆలోచనలు.. అబ్బుర పర్చే ఆవిష్కరణలతో వరంగల్‌ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ (నిట్‌)లో సాంకేతిక సందడి నెలకొంది. గురువారం రాత్రి లాంఛనంగా ప్రారంభమైన ‘టెక్నోజియాన్‌ -16’లో యువ ఇంజినీర్లు తమ సృజనను ఆవిష్కరించే అద్భుత ఘట్టానికి శుక్రవారం ఉదయం తెర తీశారు. తరగతి గదుల్లో పుస్తకాలతో కుస్తీపట్టే విద్యార్థులు తమ ప్రయోగాలను కళ్లముందుంచి ఔరా అనిపించారు. ఏటా మూడు రోజుల పాటు జరిగే ఈ సాంకేతిక వేడుకకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాల విద్యార్థులు తరలివచ్చారు. టెక్నోజియాన్‌లో మొత్తం 50 ఈవెంట్లు నిర్వహిస్తుండగా.. తొలిరోజు టెక్నోక్రాట్‌లు ఉత్సాహంగా పాల్గొన్నారు. సాంకేతికతో ముడిపడిన ఎన్నో ఆటలు ప్రదర్శించారు. వీటికి తోడు.. నోరూరించే ఫుడ్‌స్టాళ్లు.. ఆకట్టుకునే కొత్త ఫ్యాషన్లకు నిట్‌ వేదికైంది.
8000 టెక్నోజియాన్‌లో భాగస్వాములవుతున్న విద్యార్థుల సంఖ్య
వీడని నీడ..
వాడి పారేసిన వస్తువులతో అహో అనిపించారు కరీ ంనగర్‌కు చెందిన వైష్ణవి శ్రీరామోజు. పనికి రాని వస్తువులతో ప్రతిబింబాలను ప్రదర్శించే ఈ కళ ప్రత్యేక గుర్తింపు పొందింది. వైష్ణవి నిట్‌లో ఎమ్మెస్సీ టెక్‌ ఫిజిక్స్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. థర్మాకోల్‌పై వివిధ వస్తువులను నిల్చోబెట్టి టార్చిటైల్‌ ద్వారా వాటిపై కాంతి ప్రసరింపజేసి గోడపై వివిధ ఆకారాలు, పేర్లు సృష్టించే వైష్ణవి.. పాత దువ్వెన, క్లిప్పులు, రబ్బర్‌ బ్యాండ్‌లు, పెన్సిల్‌, హెయిర్‌బ్యాండ్‌ లాంటివాటిని థర్మాకోల్‌పై అమర్చి ఆంగ్లంలో ‘ఫిజిక్స్‌’ పేరు వచ్చేలా అమర్చారు. గతేడాది వేడుకలోనూ ఈ అద్భుతం చేశారు.
ఆట కాదు.. టమాటా
టెక్నోజియాన్‌లో నిర్వహించిన టమాటా రేస్‌ అలరించింది. నోట్లో స్పూన్‌..స్పూన్‌లో టమాటా.. అటూ ఇటూ రెండు రౌండ్లు తిరిగితే అయిపోతుందని అనుకుంటున్నారా..! అలా అయితే మజా ఏముంది. నలుగురుగా ఉన్న బృందంలోని సభ్యులంతా నోట్లో ఉన్న స్పూన్‌ ద్వారా టమాటాను పట్టుకుని వెళ్లాలి. ఈ క్రమంలో అందరి చేతులు ఒకరికి ఒకరు పట్టుకుని అనుకున్న గడువులోగా నడుస్తూ గమ్యానికి చేరాల్సి ఉంటుంది. బృందంలోని ఏ ఒక్క వ్యక్తి తన టమాటాను కింద పడేసినా మిగతా సభ్యులంతా ఓడినట్లే!

అందనంత ఎత్తుకు!
పెద్ద పెద్ద భవనాలు, ఆకాశహర్మ్యాల డిజైన్‌ ఎలా ఉండాలో ‘టాల్‌ బిల్డింగ్‌ డిజైన్‌’ వర్క్‌షాప్‌లో విద్యార్థులకు చక్కగా వివరించారు బెంగళూరుకు చెందిన సివిల్‌ సింప్లిఫైడ్‌ కంపెనీలో పనిచేస్తున్న నిపుణుడు నిరంజన్‌. ఆధునిక కాలంలో చాలా ఎత్తయిన భవనాలను ఎంత అందంగా తీర్చిదిద్దవచ్చో ఆయన ‘ఈ టాబ్స్‌’ సాఫ్ట్‌వేర్‌ ద్వారా విద్యార్థుల కళ్లకు కట్టారు. 60 మంది విద్యార్థులు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. ఇందులో ఒక థియరీ, మూడు ప్రయోగ అంశాలతో టాల్‌ బిల్డింగ్‌ డిజైన్‌ను వివరిస్తారు.

రసాయనాలతో మాయ
రసాయనాలు.. పరిశోధనల్లో కీలకపాత్ర పోషిస్తాయి. వీటి ద్వారా ఎన్నో ఆసక్తికర ప్రయోగాలు చేయవచ్చని నిరూపించారు నిట్‌ రసాయన శాస్త్రం విభాగం విద్యార్థులు. టెక్నోజియాన్‌లో భాగంగా రసాయనాలతో ఎన్నో రకాల ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చనే ఉద్దేశంతో ఓ స్టాల్‌ను ఏర్పాటు చేశారు. కొన్ని కెమికల్స్‌ను కలపడం ద్వారా విభిన్న రంగులు రావడం, శబ్దాలు చేయడం లాంటి విషయాలను చేసి అబ్బురపరిచారు. వీటిని టెక్నోజియాన్‌కు వచ్చిన విద్యార్థులు ఎంతో ఆసక్తిగా తిలకించారు.

ఆటాడూ.. కనిపెట్టు..
టెక్నోజియాన్‌లో ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు ప్రత్యేక ఆటల పోటీలను నిర్వహించారు. వివిధ కళాశాలలకు చెందిన వారు ఇందులో ఉత్సాహంగా పాల్గొన్నారు. నలుగురు ఒక బృందంగా ఏర్పడి పోటీలో పాలుపంచుకున్నారు. పాల్గొనే వారు పేరు నమోదు చేసుకునే సమయంలోనే ఒక ఛార్ట్‌ ఇస్తారు. అందులో నిట్‌లోని ఏ గదిలో ఏ ఆటలు జరుగుతాయో సూచిస్తారు. ఒక్కో ఆటను ఆడుతూ ముందుకు వెళ్లాల్సి ఉంటుది. ఆట ఆడటం ఒక ఎత్తైతే.. ఏ ఆట ఎక్కడ నిర్వహిస్తారో కనిపెట్టడం మరో ఎత్తు. ఒక వైపు ఆటలు, మరో వైపు వెదుకులాటలతో విద్యార్థులు ఉల్లాసంగా గడిపారు. పది ఆటలు మొదట పూర్తి చేసిన వారు విజేతలు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ పోటీలు జరిగాయి.

పద్మవ్యూహంలోనూ పరుగు మొబైల్‌ ఫోన్‌ నుంచి బ్లూటూత్‌ కంట్రోలర్‌ యాప్‌ ద్వారా పనిచేసే లాజో లాబ్రియన్త్‌ కారును రూపొందించారు అమన్‌, జైహింద్‌, ప్రతీమ్‌, సుమీత్‌. ఈ కారు నడవడం మరింత ఆసక్తిగా ఉంటుంది. దీని కోసం గజిబిజి దారిని మొదట నిర్మిస్తారు. ఆ దారిలో ఎక్కడ తోవ తప్పకుండా ఈ కారు దారిని కనుక్కుంటూ ముందుకెళ్లాలి. ఆర్డ్వినో మైక్రో కంట్రోలర్‌ ద్వారా ఇది పనిచేస్తుంది. ఈ నమూనా రూపకల్పన కోసం వారం పట్టింది. రూ. 4500 వెచ్చించి యాప్‌ ద్వారా నియంత్రించే ఈ కారును తయారుచేశారు.

స్వచ్ఛభారత్‌ హమారా..!!
టెక్నోజియాన్‌ అంటే కేవలం డిజిటల్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా వంటి కార్యక్రమాలు మాత్రమే కాదు.. పచ్చదనం, పరిశుభ్రతను చాటి చెప్పే ‘స్వచ్ఛభారత్‌’లో సైతం మేము భాగస్వాములమంటూ తమ ప్రత్యేకతను చాటారు విద్యార్థులు.శుక్రవారం ప్రారంభమైన టెక్నోజియాన్‌లో నిట్‌ కెమిస్ట్రీ విభాగానికి చెందిన పలువురు విద్యార్థులు బృందంగా విడిపోయి స్వచ్ఛభారత్‌ ఆవశ్యకతను తెలియజేశారు. ‘‘ప్రజలు తిరిగే స్థలాల్లో చెత్తను వేయకండి-డస్ట్‌ బిన్లను వాడండి’’ అంటూ ప్రదర్శన చాటారు.అంతటితో ఆగకుండా స్వయంగా టెక్నోజియాన్‌ జరిగే ప్రాంతమంతా బృందాలుగా విడిపోయి చెత్తను సేకరించారు.

అర నిమిషం అంధత్వమే.. కష్టంగా..!
కళ్లుండీ కొందరు మనుషులు గుడ్డివాళ్లుగా ప్రవర్తిస్తున్న నేటి సమాజంలో.. నిజంగా మాటలు రాని, కళ్లులేని వారి పరిస్థితి ఎలా ఉంటుందో తెలపడానికి ఎన్‌ఐటీ విద్యార్థులు చిన్ని ప్రయత్నం చేశారు. టెక్నోజియాన్‌లో భాగంగా విద్యార్థి బృందం ఐకమత్యం ప్రాధాన్యం తెలుపుతూనే దివ్యాంగులు పడే అవస్థలను చూపింది. ఆటలో భాగంగా మొత్తం నలుగురు వ్యక్తులు ఉంటారు. మొదటి ముగ్గురు వ్యక్తులకు కళ్లు కనిపించకుండా రుమాలు అడ్డుగా కడతారు. అంతే కాకుండా వారు నడిచే మార్గంలో అడ్డుగా, ఇరువైపులా పలుచోట్ల తాడును పెడతారు. ముగ్గురు వ్యక్తుల్లో ఏ ఒక్కరు తాడును తాకినా ఇక ఓడినట్లే..! ఆటలో చివరగా ఉన్న వ్యక్తి కేవలం తన చేతి స్పర్శ ద్వారా మాత్రమే ముందరి వ్యక్తులకు దారిని చూపాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆటలో పాల్గొన్న వ్యక్తులు నాలుగు అడుగులు సరైన మార్గంలో నడవలేకపోయారు. ఈ ఆట ద్వారా నిర్వాహకులు అంధులు, బధిరులు ఎదుర్కొంటున్న సమస్యలను అందరి కళ్లకు కట్టినట్లుగా చూపారు. తమదైన జీవితంలో దివ్యాంగులను చిన్నచూపు చూడకుండా ఆదరించాలని తమ ప్రదర్శన ద్వారా తెలిపారు..

గోడెక్కిన మొక్కలు
ఇంటి పెరట్లో ఉండాల్సిన మొక్కలు గోడను ఎక్కడమేంటి..?అందులోనూ బాటిళ్లలోకి ఎక్కడమేంటి? అని చూస్తున్నారా..! అదే టెక్నోజియాన్‌ ప్రత్యేకత.మామూలుగా నగరంలో నివాసముంటూ స్థలం లేకపోవడం వల్ల ఇలాంటి మొక్కలు పెంచడం సులభమని నిట్‌ ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగానికి చెందిన కెడెట్లు తమ ప్రదర్శన ద్వారా చూపారు. దీనికి మరింత ప్రత్యేక వచ్చేలా..టెక్నోజియాన్‌ పేరులోని ‘టీజెడ్‌’ ఆంగ్ల అక్షరాలు వచ్చేలా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు.

టెలి స్కోపుల్లో వాడేందుకు
మైక్రోస్కోపు, టెలిస్కోపులు ఇప్పుడున్నదానికన్నా మరింత మెరుగుగా పనిచేసేందుకు క్వాంటమ్‌ ఎరేజర్‌ ప్రయోగాన్ని చేశారు దిల్లీకి చెందిన వెబఫ్‌, నాగ్‌పూర్‌కు చెందిన శార్దూల్‌. వీళ్లిద్దరూ నిట్‌లో టెక్‌ ఫిజిక్స్‌ ద్వితీయ సంవత్సరం అభ్యసిస్తున్నారు. ఈ నమూనాపై మరింత పరిశోధన చేయాల్సి ఉందని పేర్కొన్నారు.


Vijayawada TownHub ·
For more info about Vijayawada, Please Download "Vijayawada TownHub" free mobile app from google play store / apple store.