గ్రామీణ సేవలకే ప్రాధాన్యమంటున్న యువత
ప్రభుత్వ కొలువు పొందేందుకు యువత పోటీ పడుతోంది. అది చిన్నపాటి కొలువైనా సరే ప్రభుత్వ ఉద్యోగమైతే చాలు అనే ధోరణిలో ఉన్నారు. అందుకే అందుబాటులో ఉన్న చిన్నపాటి అవకాశాన్ని కూడా వదులుకోవాలనుకోవడం లేదు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన పలు పోస్టులకు భారీ స్థాయిలో దరఖాస్తు చేసుకున్నారు. ఎలాగైనా అందులో ప్రతిభ చూపి మంచి ఉద్యోగం సంపాదించేందుకు పేరున్న పలు శిక్షణ కేంద్రాల్లో చేరి శిక్షణ పొందుతున్నారు. ప్రధానంగా ఇంజినీరింగ్, పీజీ చేసిన వారు కూడా ఈపోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు.నూతన రాష్ట్ర ఆవిర్భావంతో గ్రామీణప్రాంతాల్లో సేవలందించేందుకు వివిధ నియామకాలకు ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. దీనిలో భాగంగా ఇటీవల పోలీసు, ఎక్సైజు సిబ్బంది, గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ కార్యదర్శుల నియామకాలు చేపడుతోంది. గ్రామీణప్రాంతాలకు వెళ్లి, నేరుగా సేవలందించేందుకు అవకాశాలు ఉండడంతో ఆయా కొలువులపై యువత దృష్టి సారించింది. ఈ దిశగా ప్రభుత్వం నిర్వహించే ప్రతిభా పరీక్షల్లో నెగ్గేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలోని విజయవాడ, విస్సన్నపేట, చల్లపల్లి తదితర ప్రాంతాల్లో ఉన్న పలు శిక్షణకేంద్రాల్లో శిక్షణ పొందేందుకు చేరుతున్నారు. ఒక్క విస్సన్నపేటలోని శిక్షణ కేంద్రాల్లోనే సుమారు 300మంది యువత శిక్షణ పొందుతున్నారు. గ్రామీణప్రాంతాల్లో నేరుగా ప్రజలకు సేవలందించేందుకు అవకాశం ఉండడంతో తాము ఆయా పోస్టులకు దరఖాస్తు చేశామని యువత అంటున్నారు. గ్రామాల్లో సేవ చేయాలని లింగవరపు రాజవర్ష(బి.టెక్), ఆగిరిపల్లి మండలం
ఇంజినీరింగ్ చదివే సమయంలో ఎన్‌సీసీ క్యాడెట్‌గా శిక్షణ పొందాను. గ్రామీణప్రాంత ప్రజలకు నేరుగా సేవలు చేసే అవకాశం ఉన్న ఏ పనైనా చేపట్టాలని ఆనాడే నిర్ణయం తీసుకున్నాను. బీటెక్ పూర్తి చేసిన తరువాత హైదరాబాద్, ముంబయి వంటి ప్రాంతాల్లో ఉన్నతమైన ఉపాధి అవకాశాలు లభించినా, కానిస్టేబుల్, ఎస్‌ఐ వంటి ఉద్యోగిగా గ్రామాలకు వెళ్లాలని నిర్ణయించుకుని, ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాను. ఎలాగైనా గ్రామాల్లో సేవలందించాలనేదే నా లక్ష్యం.
నాటుసారా నేపథ్యంతో మారిన విధానం ధారావతు బుజ్జి(ఎంఏ, బీఈడీ), విస్సన్నపేట మండలం
గిరిజన తండాలో పుట్టి పెరిగిన నేను నాటుసారా కారణంగా గ్రామాల్లోని పేదలు ఎదుర్కొంటున్న వివిధ సామాజిక సమస్యలను దగ్గరగా చూశాను. నాటుసారా మహమ్మారిని సమూలంగా నిర్మూలించేందుకు ఎక్సైజు, పోలీసుశాఖల్లో విద్యావంతులైన యువత చేరి, ప్రయత్నించాల్సిన అవసరం ఉందని గుర్తించాను. అభ్యసించిన విద్యతో ఏ అవకాశం లభించినా, నా లక్ష్యం మాత్రం ఎక్సైజు, పోలీసుశాఖలో చేరాలని నిర్ణయించుకున్నాను. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన నియామక నోటిఫికేషన్లను పరిశీలించి, లక్ష్యాన్ని సాధించే దిశగా కృషి చేస్తున్నాను.
ప్రజాసేవకు అవకాశం ఎక్కువ గంటా ఆకాష్(బీటెక్), విస్సన్నపేట మండలం
ప్రజాసేవకు ప్రభుత్వ రంగం ద్వారా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రజలతో నేరుగా సంబంధాలు ఏర్పాటు చేసుకుని, వారికి ఉపయోగపడేలా వివిధ పథకాల అమలులో భాగస్వామిగా వ్యవహరించేందుకు వెసులుబాటు ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాను. లక్ష్యం ఖచ్చితమైనదైతే తప్పనిసరిగా విజయం సాధిస్తామనేది నా నమ్మకం. వివిధ ప్రాంతాల్లో ఉన్నతస్థాయి ఉపాధి అవకాశాలు ఉన్నప్పటికీ, ప్రభుత్వరంగం ద్వారా ప్రజాసేవకే ప్రాధాన్యమిచ్చాను.
యువతలో ఆసక్తి పెరిగింది అప్పికట్ల కుమార్, కోచింగ్‌కేంద్రం నిర్వాహకుడు, విస్సన్నపేట
ప్రభుత్వ రంగం ద్వారా ప్రజలకు నేరుగా సేవలందించాలనే తపన నేటి యువతరంలో ఎక్కువగా కనిపిస్తోంది. గత దశాబ్దకాలంగా కోచింగ్ కేంద్రం నిర్వహిస్తున్నప్పటికీ, గతంలో ఎప్పుడూ లేనంతగా చిన్నస్థాయి ప్రభుత్వ కొలువులకు ఉన్నతస్థాయి విద్యావంతులైన యువత ఆసక్తి చూపడం ఇది మొదటిసారి. ప్రభుత్వ కొలువులో చేరితే ప్రజలకు సేవ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేది యువత ఆలోచన.
0 thoughts on “కొలువుకు వేళాయెరా..”