సమయం ఉంది... సన్నద్దం కండి!
‘ఇండియా
పోస్ట్ పేమెంట్ బ్యాంకు’ నుంచి 1700కు పైగా అధికారుల నియామకాలు
జరగనున్నాయి. ఐబీపీఎస్ పీఓ పరీక్షకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు అదే
పరీక్ష విధానంతో ఉన్న ఐపీపీబీ స్కేల్-1 ఆఫీసర్ల పరీక్ష అదనపు అవకాశం
కానుంది!
భారతీయ
రిజర్వు బ్యాంకు గత సంవత్సరం పరిమిత బ్యాంకింగ్ వ్యవహారాలు జరపడానికి 11
సంస్థలకు ‘పేమెంట్ బ్యాంకు’లుగా అనుమతి మంజూరు చేసింది. వాటిలో తపాలా
విభాగం ఒకటి. ఆ విధంగా పబ్లిక్ లిమిటెడ్ కంపనీగా ఈ సంవత్సరం ఆగస్టులో
‘ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు’ అవతరించింది. ఇది పూర్తిగా భారత
ప్రభుత్వానికి చెందిన సంస్థ.
‘ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు’ తన కార్యకలాపాలు కొనసాగించడానికి
స్కేల్-1 నుంచి వివిధ హోదాల్లో 1700కు పైగా అధికారుల నియామకాల కోసం
ఐపీపీబీ తాజాగా నోటిఫికేషన్ను విడుదల చేసింది. వీటిలో గ్రాడ్యుయేషన్
అర్హతతో 650 స్కేల్-1 ఆఫీసర్లు, 3 సంవత్సరాల అనుభవంతో 652 స్కేల్-2
ఆఫీసర్లు, 6 సంవత్సరాల అనుభవంతో 480 స్కేల్-3 ఆఫీసర్ల పోస్టులున్నాయి.
ఐబీపీఎస్ పీఓకు సిద్ధమయ్యేవారితో పాటు కొత్తగా పరీక్ష రాసేవారు కూడా విజయం
సాధించడానికి సరిపోయే 2- 3 నెలల సమయం ఉంది.
ఎంపిక విధానం
స్కేల్- 1 ఆఫీసర్ల ఎంపిక ఆన్లైన్ రాతపరీక్ష, మౌఖిక పరీక్షల ద్వారా
జరుగుతుంది. స్కేల్-2, స్కేల్-3 ఆఫీసర్ల ఎంపిక బృందచర్చ (గ్రూప్
డిస్కషన్)/+ ఇంటర్వ్యూల ద్వారా జరుగుతుంది.
రాతపరీక్ష: స్కేల్-1
ఆఫీసర్ల ఎంపికలో రెండంచెల ఆన్లైన్ రాతపరీక్ష (ప్రాథమిక, ప్రధాన
పరీక్షలు), ఇంటర్వ్యూలు ఉంటాయి. ఈ పరీక్ష ఐబీపీఎస్ (పీఓ) పరీక్ష
విధానంలాగానే ఉంటుంది.
ప్రాథమిక పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలతో కూడిన మూడు సబ్జెక్టులు ఉంటాయి.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (35 ప్రశ్నలు), రీజనింగ్ (35 ప్రశ్నలు),
ఇంగ్లిష్ లాంగ్వేజ్ (30 ప్రశ్నలు). వీటికి మార్కులు కూడా అదే సంఖ్యలో
ఉంటాయి. ఈ పరీక్షకు ఉన్న మొత్తం వ్యవధి ఒక గంట.
ఇక ప్రధాన పరీక్షలో మొత్తం 5 విభాగాలుంటాయి. వీటిలో క్వాంటిటేటివ్
ఆప్టిట్యూడ్, రీజనింగ్ విభాగాలకు 50 ప్రశ్నల చొప్పున, ఇంగ్లిష్, జనరల్
అవేర్నెస్ విభాగాలకు 40 ప్రశ్నల చొప్పున, కంప్యూటర్ నాలెడ్జ్ విభాగంలో
20 ప్రశ్నలు కలిపి మొత్తం 200 ప్రశ్నలు, అంతే సంఖ్యలో మార్కులు ఉంటాయి.
ఈ పరీక్షకు మొత్తం 140 నిమిషాల సమయాన్ని విభాగాలవారీగా కేటాయించారు.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్లు ఒక్కో విభాగానికి 40 నిమిషాలు,
ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 నిమిషాలు, జనరల్ అవేర్నెస్కు 20 నిమిషాలు,
కంప్యూటర్ నాలెడ్జ్ విభాగానికి 10 నిమిషాల సమయం కేటాయించారు. అభ్యర్థులు
ఏదైనా విభాగాన్ని మొదలుపెడితే ఆ విభాగానికి కేటాయించిన నిర్ణీత సమయం
పూర్తయ్యేవరకు మరొక విభాగంలోకి ప్రవేశించే అవకాశముండదు.
ప్రాథమిక, ప్రధాన పరీక్షలు రెండింటిలోనూ అభ్యర్థులు కనీస మార్కులతో ప్రతి
విభాగంలో విడివిడిగా ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా అన్ని
ప్రశ్నలకు రుణాత్మక మార్కులు ఉంటాయి. అభ్యర్థులు గుర్తించిన ప్రతి తప్పు
సమాధానానికి ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో నాలుగోవంతు కోత విధిస్తారు.
సబ్జెక్టులు- అవగాహన
* క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: ప్రాథమిక
పరీక్షలో 35 ప్రశ్నలు, ప్రధాన పరీక్షలో 50 ప్రశ్నలు ఈ విభాగంలో ఉన్నాయి.
ప్రశ్నల సంఖ్యలో కొద్దిగా తేడా ఉన్నా ప్రశ్నలు వచ్చే అంశాలు రెండు
పరీక్షల్లోనూ దాదాపుగా ఒకేవిధంగా ఉంటాయి. సింప్లిఫికేషన్స్, నంబర్
సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, డేటా సఫిషియన్సీ, డేటా
ఇంటర్ప్రిటేషన్, అరిథ్మెటిక్ నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటితోపాటు
పర్మ్యుటేషన్స్- కాంబినేషన్స్ (ప్రస్తారాలు- సంయోగాలు) నుంచి కూడా
ప్రశ్నలుంటాయి.
అరిథ్మెటిక్లో నంబర్ సిస్టమ్, శాతాలు, నిష్పత్తి- అనుపాతం, సగటు,
లాభనష్టాలు, బారువడ్డీ- చక్రవడ్డీ, పని- కాలం, కాలం- దూరం, ట్రెయిన్,
బోట్ ప్రశ్నలు, క్షేత్రగణితం మొదలైనవి ముఖ్యం.
* రీజనింగ్: ఈ
విభాగంలో కూడా ప్రాథమిక పరీక్షలో 35 ప్రశ్నలు, ప్రధాన పరీక్షలో 50
ప్రశ్నలు ఉంటాయి. వీటిలో జనరల్ రీజనింగ్, ఎనలిటికల్ రీజనింగ్/
క్రిటికల్ రీజనింగ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి.
కోడింగ్- డీకోడింగ్, ఆల్ఫబెట్- నంబర్ సిరీస్, డైరెక్షన్స్,
ఇన్ఈక్వాలిటీస్, బ్లడ్ రిలేషన్స్, సీటింగ్ అరేంజ్మెంట్, సిలాజిజమ్
మొదలైన వాటితోపాటు అనలిటికల్/ క్రిటికల్ రీజనింగ్లోని స్టేట్మెంట్స్-
అసంప్షన్స్, కన్క్లూజన్స్, కోర్సెస్ ఆఫ్ యాక్షన్, ఇన్ఫరెన్స్,
పజిల్ టెస్ట్, ఇన్పుట్-అవుట్పుట్, ప్రాబ్లమ్ సాల్వింగ్, డెసిషన్
మేకింగ్ మొదలైన వాటినుంచి ప్రశ్నలుంటాయి.
స్టేట్మెంట్ సంబంధ ప్రశ్నల్లో జవాబులన్నీ సరైనవేనన్న భ్రమ కలిగించే
విధంగా ఉంటాయి. అందువల్ల అభ్యర్థులు వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సరైన
సాధన ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.
* ఇంగ్లిష్ లాంగ్వేజ్:
ప్రాథమిక పరీక్షలో 30 ప్రశ్నలు, ప్రధాన పరీక్షలో 40 ప్రశ్నలు ఈ విభాగం
నుంచి ఉంటాయి. ఈ రెండు పరీక్షల్లో దాదాపు ఒకే తరహాలో ప్రశ్నలు ఈ విభాగం
నుంచి ఉంటాయి.
వీటిలో కాంప్రహెన్షన్, స్పాటింగ్ ఎర్రర్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్,
క్లోజ్టెస్ట్, సెంటెన్స్ కరెక్షన్స్, రీ అరేంజ్మెంట్ ఆఫ్
సెంటెన్సెస్, సిననిమ్స్, ఆంటనిమ్స్ మొదలైనవాటి నుంచి ప్రశ్నలుంటాయి.
వ్యాకరణంలో ప్రాథమికాంశాలను బాగా చూసుకుంటే సగానికి పైగా ప్రశ్నలకు
జవాబులను తేలికగా గుర్తించవచ్చు.
* జనరల్ అవేర్నెస్: బ్యాంకింగ్,
ఆర్థికాంశాలను కేంద్రీకరిస్తూ గత 3, 4 మాసాల కాలంనాటి వర్తమానాంశాల నుంచి
వీటిలో ప్రశ్నలు వస్తాయి. ముఖ్యమైన సంఘటనలు, వ్యక్తులు, ప్రదేశాలు, కేంద్ర
ప్రభుత్వ పథకాలు, ఆర్థిక సంస్థలు, భారతీయ రిజర్వు బ్యాంకు, పుస్తకాలు-
రచయితలు, అవార్డులు, క్రీడలు, ముఖ్యమైన తేదీలు, ఆర్థిక సంబంధమైన విషయాలు
మొదలైనవాటి నుంచి ప్రశ్నలుంటాయి. సరైన విధంగా చూసుకుంటే ఎక్కువ మార్కులు
తెచ్చుకోగలిగే విభాగం.
* కంప్యూటర్ నాలెడ్జ్: ఇది
కూడా ఎక్కువ మార్కులను తెచ్చుకునే వీలున్న విభాగం. సాధారణంగా దీనిలో
కంప్యూటర్ ప్రాథమికాంశాలు, జనరేషన్స్, ఎంఎస్ ఆఫీస్- వాటి షార్ట్కట్
కీలు, ఇంటర్నెట్, నెట్ వర్కింగ్, డీబీఎంఎస్, వైరస్, యాంటీవైరస్,
కంప్యూటర్ రంగంలోని వర్తమానాంశాలు మొదలైనవాటి నుంచి ప్రశ్నలుంటాయి.
సన్నద్ధత
స్కేల్-1 ఆఫీసర్ల రాతపరీక్ష ఐబీపీఎస్ పీఓ పరీక్ష మాదిరిగానే ఉంటుంది.
కాబట్టి ఆ పరీక్ష రాసే అభ్యర్థులకు అదే సన్నద్ధత సరిపోతుంది. ఒకవేళ పీఓ
పరీక్షకు వారి సన్నద్ధత సరిగా లేకపోతే ప్రస్తుత ఐపీపీబీ పరీక్షకు సరైన
విధంగా సన్నద్ధమవాలి. ఆన్లైన్ రాతపరీక్షలు డిసెంబర్/ జనవరి నెలల్లో
నిర్వహిస్తారు. దాదాపు 2 నుంచి 3 నెలల సమయం ఉంటుంది. మొదటిసారి పరీక్ష రాసే
అభ్యర్థులకు కూడా ఈ సమయం సరిపోతుంది.
ఈ సమయాన్నంతా సబ్జెక్టులపై అవగాహన పెంచుకుని సాధన చేయడానికి తగిన విధంగా
విభజించుకోవాలి. రీజనింగ్, అరిథ్మెటిక్లోని అన్ని అంశాలను బాగా
నేర్చుకుని వివిధ తరహా ప్రశ్నలు సాధన చేయాలి. ఐబీపీఎస్ పీఓ మాదిరి
ప్రశ్నపత్రాలు బాగా సాధన చేయాలి. పూర్వ ప్రశ్నపత్రాల ద్వారా ప్రతి విభాగంలో
ఏ తరహా ప్రశ్నలు ఎన్నెన్ని వస్తున్నాయో గమనించి తదనుగుణంగా వాటికి
సన్నద్ధమవాలి. ప్రాథమిక, ప్రధాన పరీక్షలు రెండింటినీ ఒకటే పరీక్షగా భావించి
5 విభాగాలకూ ఇప్పటినుంచే సన్నద్ధమవాలి.
ప్రధాన పరీక్షలో ఉన్న 5 సబ్జెక్టుల్లో మూడు ప్రాథమిక పరీక్షలోనూ ఉన్నాయి.
కాబట్టి ప్రధాన పరీక్షను దృష్టిలో ఉంచుకునే సన్నద్ధత సాగించాలి.
0 thoughts on “ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు”