తాజా లోకల్ ఈవెంట్స్
Search

ఆందోళనకరంగా దూసుకొస్తున్న ఆటోమేషన్

**** ఆందోళనకరంగా దూసుకొస్తున్న ఆటోమేషన్ ****ఆందోళనకరంగా దూసుకొస్తున్న ఆటోమేషన్

అవలోకనం
మన ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఆందోళన చెందాల్సిన ఒక విషయం ప్రస్తుతం బిజినెస్ వార్తా పత్రికలకే పరిమితమైంది. అది, భారత సమాచార సాంకేతికతకు, సాఫ్ట్‌వేర్ పరిశ్రమకు, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటి ఐటీ కంపెనీలకు సంబంధించినది. గత రెండు దశాబ్దాలుగా త్వరితగతిన విస్తరించిన ఈ కంపెనీల వృద్ధి మందగించిపోయింది. ప్రస్తుతం అవి ఒక్క అంకె వార్షిక వృద్ధితో నడుస్తున్నాయి. దాన్ని కొనసాగించడానికీ తంటాలు పడుతున్నాయి. భారత్‌లో ఐటీ పరిశ్రమ మరణశయ్యపై ఉందనే ఊహాగానాలకూ అది దారి తీస్తోంది.

మానవ పెట్టుబడి స్థానంలో ఆటోమేషన్ (మనుషులు చేసే పనిని అత్యాధునిక సాంకేతికతతో తయారయ్యే యంత్రాలే నిర్వహించడం) ప్రవేశించడం అందుకు ఒక కారణం. ఇది, ఆ కంపెనీలు అందించే సేవలను, వాటిలోని వందల వేల ఉద్యోగులను ప్రభావితం చేస్తుంది. ఇన్ఫోసిస్ మాజీ నేత మోహన్ దాస్ పాయ్ సరైన దృక్కోణం నుంచి ఈ పరిణామాన్ని చక్కగా వివరిస్తూ ఓ వ్యాసం రాశారు. మార్పు రానున్నా అందుకు మూడేళ్ల నుంచి ఐదేళ్ల వ్యవధి పడు తుంది, భారత ఐటీ కంపెనీలు ఆ మార్పును ఎదుర్కోగల మంచి స్థితిలోనే ఉన్నా యని ఆయన అభిప్రాయం. ఆయన ఇలా రాశారు

‘‘నేటి పరిస్థితిని చూద్దాం. భారత సాఫ్ట్‌వేర్ ఎగుమతుల పరిశ్రమ దాదాపు 11,000 కోట్ల డాలర్ల విలువైనది. అది దాదాపు 42.50 లక్షల మంది ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తోంది. ప్రపంచ ఔట్‌సోర్సింగ్‌లో దాని మార్కెట్ వాటా 60 శాతం, ప్రపంచంలో దానిది ఆధిపత్య స్థానం. మార్కెట్ విలువను బట్టి పది అగ్రశ్రేణి సాఫ్ట్‌వేర్ సర్వీస్ కంపెనీలలో భారత కంపెనీలు ఐదు. అగ్రశ్రేణి ఐదు సంస్థలలో నైతే మూడు భారత్‌వి. వాటన్నిటికీ భారత్‌లో భారీ ఉనికి ఉంది. ఈ 10 కంపెనీ లలోని దాదాపు 20 లక్షల మంది మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 70 శాతం భారత్ కేంద్రంగా చేస్తున్నవారు లేదా భారత్ నుంచి బయటకు వె ళ్లినవాళ్లు. విదేశాలలోని భారత సాఫ్ట్‌వేర్ పరిశ్రమ ప్రపంచ సాఫ్ట్‌వేర్ సేవల రంగంలో అధిపత్య స్థానంలో ఉంది. దానికి సాటి ఏదీ లేదు.’’

ప్రపంచ స్థాయి నాయకత్వంలో మన పెద్ద కంపెనీలకు అనుభవం ఉంది, అసాధారణ ప్రతిభగల మేనేజ్‌మెంట్ సైతం వాటికి ఉంది. కాబట్టి అవన్నీ ఈ మార్పును తమకు సాధ్యమైనంత అత్యుత్తమమైన రీతిలో ఎదుర్కోగలుగుతాయనే మనమంతా ఆశించాలి. అయితే ఈ మార్పు వ్యవస్థాగతమైనదని, ఉన్నదాన్ని ఛిద్రం చేసేదని అభిప్రాయపడుతున్నవారు కూడా ఉన్నారు.

కొన్ని వారాల క్రితం నేను హైదరాబాద్‌లో జరిగిన ఒక సెమినార్‌లో మాట్లా డాను. ఐబీఎం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు) కార్యక్రమమైన ‘వాట్సన్’ విభాగాధిపతి మనోజ్ సక్సేనా కూడా ఆ కార్యక్రమంలో మాట్లాడారు. ఆయన చెప్పిన విషయం బాగా ఆందోళన కలిగించేదిగా ఉంది. వచ్చే దశాబ్ద కాలంలో సాంకేతికతలో రానున్న మార్పులను ఆయన వివరించారు. ఆ పరివర్తనకు తగిన విధంగా మనం సంసిద్ధమై లేమన్నట్టు మాట్లాడారు. మన కంపెనీలు ఇప్పటికి ఉన్న వందల వేల కోట్ల డాలర్ల వ్యాపారాలపైనే దృష్టి కేంద్రీకరణను  కొనసాగిస్తున్నాయని, ఇది వంద మైళ్ల వేగంతో పోతున్న కారు టైర్లను మార్చడం లాంటిదని అన్నారాయన.

మనలో చాలా మంది ఊహిస్తున్న దాని కంటే మరింత వేగంగా ఆటోమేషన్ దూసుకొస్తోంది. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పాయ్ ఇలా అన్నారు: ‘‘నేడు ఏడాదికి రూ. 30 లక్షల నుంచి రూ. 70 లక్షల వరకు సంపాదిస్తున్న వారు (మధ్యస్త స్థాయి మేనేజర్లు) చాలా మందే ఉన్నారు. వారిలో సగం మంది రాబోయే పదేళ్లలో ఉద్యోగాలు కోల్పోతారు.’’

ఆయన చెప్పేదాన్ని బట్టి, భారత ఐటీ పరిశ్రమలోని మొత్తం ఉద్యోగులలో 10 శాతం లేదా 4,50,000 మంది మధ్యస్త స్థాయి మేనేజర్లు ఉంటారు. వీరిలో 2,25,000 మంది, వారి పనిని ఆటోమేషన్ చేయడం వల్ల వచ్చే దశాబ్ద కాలంలో ఉద్యోగాలు కోల్పోతారు. ఇది అనేక విధాలుగా విచారకరమైన వార్త. ఒకటి, భారత ఐటీ కంపెనీలు సాఫ్ట్‌వేర్ పనిలో తమ మార్కెట్ వాటాను కాపాడుకున్నా, ఆ పని ఆటోమేట్ అయిపోతుంది. అంటే తక్కువ మంది ఉద్యోగులే ఉంటారు.

రెండు, ఆటోమేషన్ వల్ల ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా తయారీ రంగంలో ఉద్యోగాలు క్షీణిస్తున్నాయి. వాస్తవానికి రోబోటిక్స్ సాంకేతికత కొన్ని తయారీ రంగ ఉద్యోగాలు తిరిగి పాశ్చాత్య దేశాలకు తిరిగి రావడానికి కారణమైంది కూడా. మూడు, భారత్ మరింత సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించడానికి తంటాలు పడుతున్న దశలో ఈ ఐటీ రంగ పరివర్తన రావడం. ఉద్యోగ కల్పనకు సంబంధిం చిన గణాంకాలన్నీ ఆందోళనకరంగానే ఉన్నాయి.

నాలుగు, ఉద్యోగాల సమస్యపై జనాభాలోని పెద్ద విభాగాలలో ఇప్పటికే అసంతృప్తి ప్రబలివుంది. మూడు లేదా నాలుగు అత్యంత పారిశ్రామికీకరణ చెందిన రాష్ట్రాలు గుజరాత్, హరియాణ, మహారాష్ట్రలలోని ఆధిపత్య కులాలు ఈ సమస్యపై ఇప్పటికే ఆందోళన సాగిస్తున్నాయి. పటేళ్లు, జాట్లు, మరాఠాలు ఉద్యోగాల విషయంలో తమకు ప్రభుత్వ సహాయం అందడం అవసరమని భావి స్తున్నారు. అయితే ప్రధానంగా వారు చాలా వరకు పట్టణాలకు చెందినవారే. బెంగళూరు, ముంబై, చెన్నై, హైదరాబాద్, గుర్గావ్ కేంద్రంగా ఉన్న మన ఐటీ పరిశ్రమలో అగ్ర కులాల వారికి చాలా ఎక్కువగా ఉద్యోగాలు లభించాయి.

ఈ వర్గం, తమకు ఇంగ్లిష్ విద్య, సేవారంగ ఉద్యోగాలు సులువుగా అందు బాటులో ఉండటంతో రిజర్వేషన్లకు వ్యతిరేకం. ప్రపంచవ్యాప్తంగా సాంకేతికతలో వేగంగా మార్పులు సంభవించడం అంటే అర్థం, ఇకపై ఈ పరిస్థితి ఇలా ఉండదని అర్థం. ఇది, ప్రభుత్వానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదని నా అభి ప్రాయం. అయినా రానున్న ఈ మౌలిక మార్పుల గురించి, అవి తమ జీవితాలను ఎలా ప్రభావితం చేయనున్నాయనే దాని గురించి భారతీయులందరికీ తెలిసి ఉండటం అవసరం.

Vijayawada TownHub ·
For more info about Vijayawada, Please Download "Vijayawada TownHub" free mobile app from google play store / apple store.


TAG

nanomag

Complete information about Local Events in Vijayawada


0 thoughts on “ఆందోళనకరంగా దూసుకొస్తున్న ఆటోమేషన్